ఏపీలోని చిత్తూరులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు వచ్చాయి. నిమిషాల్లోనే పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో నిర్వాహకులతో పాటు కార్మికులు రెండో అంతస్తులో ఉన్నారు. అయితే మంటలు భారీగా ఎగిసిపడటంతో నిద్రిస్తున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు.
మంటలు మాడిమసై పోయిన వారిలో పరిశ్రమ నిర్వాహకుడు భాస్కర్, అతని కొడుకు డిల్లీ బాబు ఉన్నారు. భాస్కర్ స్నేహితుడు బాలాజీ కూడా సజీవ దహనమయ్యాడు. అగ్రి ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కు వచ్చి మంటలు ఆర్పివేశారు. తర్వాత లోపలికి వెళ్లి చూడగా సజీవ దహనమైన ముగ్గురు మృతదేహాలు కనిపించాయి. పైర్ ఇంజన్లు సకాలంలో రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే స్థానికులు ఇంటి గోడలు పగలగొట్టి బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు.
ప్రమాదంలో మృతి చెందిన ఢిల్లీ బాబు పుట్టినరోజునే ఈ ప్రమాదం జరగడం మరింత కలిచివేస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చాయని పోలీసులు చెబుతున్నారు.