40 ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు 40 నెలల తరువాత ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని, వారు నిన్ను విడిచివెళ్లారని కొత్తగా చేసే కొంగ జపం ఈ రాష్ట్ర బీసీ ప్రజానీకం గమనిస్తుందని చంద్రబాబు ఎరగడం లేదా? అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలో 142 కులాలు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు పరిపాలన, 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. రాష్ట్రంలో కేవలం 11 కార్పొరేషన్లు ఉంటే, ఎన్నికలకు ముందు 2019 జనవరిలో మరో 15 పెంచారు. అంటే మొత్తం 26 కార్పొరేషన్లు. అధికారం వచ్చిన వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఉంటే బీసీలు నమ్మేవారు. ఎన్నికల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేశావని ప్రజలు గ్రహించబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పారు అని తెలియజేసారు.
కుల వృత్తులు ఉన్న వారికే ఆదరణ అంటూ ఓ పథకం తెచ్చారు. ఈ పథకం ఏ మేరకు ఆదరించిందో చూశాం. ఆదరణ పేరుతో ఎంత మందికి మోసం చేశావో ప్రజలకు తెలుసు. సర్పంచ్‌ల అధికారాన్ని జన్మభూమి కమిటీలకు కట్టబెట్టారు. పింఛన్లు మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీలతో సంతకాలు తీసుకున్నారు. ఆదరణ పథకం పొందాలంటే జన్మభూమి కమిటీ సిపార్స్‌లు కోరారు. అర్హులకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.