ఏపీలోని తిరుపతి జిల్లాలో ఓ మహిళ తన భర్తకు రెండో పెళ్లి చేసింది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయానన్న బాధతో ఉన్న భర్త కోర్కెను తీర్చింది ఆ భార్య. ఆమెది ఆదర్శం అనాలో, లేక అనాలోచితంగా చేసిన పిచ్చి పని అనాలో తెలియదు. కానీ ఆ ముగ్గురు మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఉంటామంటున్నారు. తమ మధ్య మనస్పర్థలేవీ లేవంటున్నారు. నెల్లూరు జిల్లా డక్కిలి అంబేద్కర్ నగర్ కు చెందిన కల్యాణ్ కు ఇటీవలే విమలతో వివాహం అయింది. వారిద్దరూ టిక్ టాక్ లో మంచి ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇద్దరూ బాగా టిక్ టాక్ లు చేసేవారు. ఇప్పుడది బ్యాన్ కావడంతో ఇతర సోషల్ మీడియా యాప్ లలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే పెళ్లి తర్వాత భర్త కాస్త మూడీగా ఉండటం గమనించింది విమల. కారణం అడిగితే చెప్పేవాడు కాదు, కానీ ఒకరోజు నిత్యశ్రీ ఎంట్రీతో విమలకు సీన్ అర్థమైంది.
కల్యాణ్ ప్రేయసి నిత్యశ్రీ. నిత్యశ్రీ కూడా టిక్ టాక్ తో పాపులర్. అప్పట్లో టిక్ టాక్ తోనే వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల కలవడం కుదర్లేదు. ఫోన్ కాంటాక్ట్ కూడా తెగిపోయింది. చివరకు ఆమెను మరచిపోయి విమలను పెళ్లి చేసుకున్నాడు కల్యాణ్. కాపురం చేస్తున్నాడు. సడన్ గా ఇప్పుడు నిత్యశ్రీ ఎంట్రీ ఇచ్చింది. మేటర్ నేరుగా విమలతోనే చెప్పింది. తామిద్దరం గతంలో ప్రేమించుకున్నామని, ఆయన్ను వదిలి ఉండలేనని ఏడ్చేసింది. ఎలాగైనా తామిద్దర్ని ఒకటి చేయాలని వేడుకుంది.
ఇక్కడ విమల రియాక్షన్ విచిత్రంగా ఉంది. తన భర్త కల్యాణ్ కి ఆయన ప్రేయసి నిత్యశ్రీని ఇచ్చి పెళ్లి చేసేందుకు విమల రెడీ అయింది అయితే తాను కూడా వారితోనే కలసి ఉంటానంది. ఈ ప్రపోజల్ నిత్యశ్రీకి నచ్చింది. కల్యాణ్ కూడా డబుల్ బొనాంజా కావాలనే అనుకున్నాడు. మొదటి పెళ్లాం చేతుల మీదుగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ముగ్గురూ కలిసి హ్యాపీగా ఉంటామంటున్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ మొదటి భార్యే చూసుకోవడం ఇక్కడ విశేషం. తన భర్త రెండో పెళ్లికి ఆమె పెళ్లి పెద్దగా వ్యవహరించింది. తన భర్తను, ఆయన ప్రేయసిని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసింది. వారిద్దరితో కలసి ఫొటోలు కూడా దిగింది.