దసరా శరన్నవరాత్రోత్సవాలలో ఆది పూజలందుకునే అమ్మవారు సోమవారం స్వర్ణకవచాలంకృత శ్రీకనకదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకారానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం మాధవవర్మ అనే మహారాజు విజయవాటికాపురిని ధర్మం నాలుగుపాదాల ఉండేటట్లుగా అత్యంత జనప్రియంగా పరిపాలించేవాడు. అతను గొప్ప దేవీ భక్తుడు.
ఒక రోజు రాజకుమారుడు నగర సందర్శనం చేస్తుండగా అతని రథచక్రాల కింద ఒక బాలుడు ప్రమాదవశాత్తూ పడి మరణిస్తాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు దుఃఖించి రాజును న్యాయం చేయమని వేడుకుంటారు. రాజు విచారంతో తన కుమారుడే ఈ సంఘటనకు కారణమని తెలిసి మరణశిక్ష విధిస్తాడు. రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడంతో పాటూ విజయవాటికా పురిలో కొన్ని ఘడియలపాటు కనకవర్షం కురిపిస్తుంది.
అప్పటినుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలుస్తూ దసరా మహోత్సవాలలో తొలిరోజు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరించడం జరుగుతోంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్య్రములు తొలగిపోతాయని ప్రతీతి. నక్షత్రకాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే ముక్కుపుడకను ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారు కనిపిస్తారు.