ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కోహ్లీ 63 పరుగులు చేశాడు. ఆరంభంలోనే కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోయిన టీమిండియాను కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి విజయానికి చేరువ చేశాడు. చివర్లో హార్దిక్ మెరుపులతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీ20 మ్యాచ్‌లో కోహ్లీ 48 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. గత కొద్ది రోజులుగా ఫామ్ కోల్పోతున్న కోహ్లి.. ధనాధన్ ఇన్నింగ్స్ తో విమర్శకులకు మరోసారి సమాధానం చెప్పాడు. ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌తో కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మెట్లలో కలిసి అత్యధిక పరుగులు చేసిన రెండో టీమ్ ఇండియా క్రికెటర్‌గా నిలిచింది. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ద్రవిడ్ మూడు ఫార్మాట్లలో కలిపి 504 మ్యాచ్‌ల్లో 24064 పరుగులు చేశాడు. ఆదివారం నాటి మ్యాచ్‌తో ద్రవిడ్ పేరిట ఉన్నరికార్డును 24078 పరుగులతో కోహ్లీ అధిగమించాడు. కోహ్లి కేవలం 471 మ్యాచ్‌ల్లోనే ఈ పరుగులు చేయడం గమనార్హం. ఈ జాబితాలో కోహ్లి కంటే క్రికెట్ దిగ్గజం సచిన్ మాత్రమే ముందున్నాడు. సచిన్ 664 మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు చేశాడు.