మహిళాభ్యున్నతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆనంద గజపతి ఆడిటోరియంలో వైయస్సార్ చేయూత మూడో విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం అర్బన్ పరిధిలో 11, 131 మంది లబ్ధిదారులకు 21. 21 కోట్ల రూపాయల మెగా చెక్కును, రూరల్ పరిధిలో 3, 258 మంది లబ్ధిదారులకు 6. 11 కోట్ల రూపాయల మెగా చెక్కులను మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్ఆర్ చేయూత ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రతి పథకాన్ని మహిళలకు లబ్ధిచేకూరే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఇంట లబ్ధిదారులకు నిధులుమంజూరు చేస్తూ నేరుగా మహిళల ఖాతాలకి డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. వైయస్సార్ చేయూత పథకం కింద 18, 750 చొప్పున ఇప్పటికీ మూడు విడతలుగా 75 వేల రూపాయలను జమ చేసినట్లు చెప్పారు. జగనన్న అందిస్తున్న ప్రోత్సాహక పథకాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు.