తప్పు చేసి అప్పు కూడు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలను ఎక్కుపెట్టారు. . నిన్నటితో రూ. 49 వేల కోట్ల అప్పు చేశారని... ఇప్పటికే ఈ ఏడాది రుణం దాటేసిందని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం కూడా వెల్లడించిందని... అయినప్పటికీ ఏపీ ప్రభుత్వ రుణ వేట కొనసాగుతూనే ఉందని అన్నారు. వేటగాడు అడవికి వెళ్లినట్టు... రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఢిల్లీకి వెళ్లి అప్పు వేటలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
గత 6 నెలల కాలంలో రూ. 49 వేల కోట్ల అప్పు చేసిన సంగతి నిజమా? కాదా? అనే సంగతి చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ ను, బుగ్గనను అడుగుతున్నానని రఘురాజు చెప్పారు. ఈ డబ్బులన్నీ ఎక్కడకు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన జగన్ ప్రసాదం తీసుకోలేదని విమర్శించారు. ఆయన క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.