నియోజకవర్గంలోని ప్రతీ సచివాలయ పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ద్వారా ప్రజలతో మమేకం కావాలి.. ప్రతి ఇంటికీ వెళ్లాలి.. ప్రతి ఒకరినీ కలుసుకుంటూ వారంలో నాలుగు రోజుల పాటు ప్రజల మధ్యే గడపాలి అని సీఎం జగన్ ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో, అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్‌లో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ఎన్నికలు ఇంకా 19 నెలలే మాత్రమే ఉన్నందున ఇప్పుడు ఎమ్మెల్యేలే స్వయంగా గడప గడపకూ వెళ్లాలని స్పష్టం చేశారు.
కొందరు ఎమ్మెల్యేలు తమ బంధువులు, వారసులను ఈ కార్యక్రమానికి పంపుతూ ఇతర పనుల్లో నిమగ్నం కావడం సరి కాదన్నారు. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచి కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించాల్సి ఉన్నందున ఇప్పటి నుంచే వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడం వల్ల ప్రజాసేవపై అవగాహన పెరుగుతుందన్నారు. కొందరు షెడ్యూల్ ప్రకారం పనిచేయడం లేదని, దీన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.