తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఒక సారి ఏపీకి రావాలని, ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఉపాధ్యాయులపై ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. వాస్తవాలేమిటో తెలుసుకోకుండా హరీశ్ రావు మాట్లాడటం సరికాదని బొత్స అన్నారు. ఈ మేరకు హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ బొత్స పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని బొత్స అన్నారు. హరీశ్ రావు ఒక సారి ఏపీకి రావాలని, ఇక్కడి టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ, ఏపీ పీఆర్సీలు పక్కపక్కనే పట్టుకుని చూస్తే తేడా తెలుస్తుందని బొత్స వ్యాఖ్యానించారు. అయినా హరీశ్ రావు తమ ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చని బొత్స అన్నారు.