కమలాపురం పట్టణాన్ని కోట్లాది రూపాయలతో ప్రగతిపథంలో పయనింపజేస్తున్నామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం రూ. 7. 6కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనాలను, రూ. 15 లక్షలతో నిర్మించిన షాదీఖానా డైనింగ్ హాలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలనలో 38 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా అందులో కమలాపురం ఒకటన్నారు. మరో రూ. 5 కోట్లతో అదనపు సదుపాయాలను కల్పిస్తామన్నారు.
పట్టణ తాగునీటి కోసం రూ. 56 కోట్లతో పథకాన్ని మంజూరు చేయించామన్నారు. రూ. 36 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 68 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రూ. 28 కోట్లతో బీసీ రెసిడెన్సియల్ హాస్టల్, రూ. 4 కోట్లతో మున్సిపల్ కార్యాలయం, రూ. 18 కోట్లతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేన్ రామాంజులరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.