సొంత నియోజకవర్గంలోని ప్రజల్లో సంగం మందే వై.ఎస్.జగన్ కు మద్దతు పలుకుతున్నారని పీకే సర్వేలో తేలిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.సత్యకుమార్ స్పష్టంచేశారు. బీజేపీ ఏపీ శాఖ చేపట్టిన ప్రజాపోరులో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో జగన్‌కు 51 శాతం మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. ఈ గణాంకాలు తాము చెబుతున్నది కాదన్న సత్యకుమార్... వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ బృందం చేయించిన సర్వేలోనే ఈ విషయం తేలిందన్నారు.
తన సొంత నియోజకవర్గంలోనే సీఎం జగన్ బొటాబొటీ మెజారిటీ పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలను గడపగడపకు వెళ్లమని చెబుతున్న జగన్... తాను మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఎందుకు తిరగడం లేదని సత్యకుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల మాదిరే జగన్ కూడా తన నియోజకవర్గంలో పర్యటించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైసీపీ పాలనను ప్రస్తావించిన సత్యకుమార్ ఆ పార్టీని ఇటీవలే నిషేధిత సంస్థల జాబితాలోకి వెళ్లిపోయిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోల్చారు. నిషేధిత పీఎఫ్ఐ, వైసీపీ రెండూ ఒకటేనని ఆయన అన్నారు. రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేనని ఆయన ఆరోపించారు. పాలనలో వైసీపీ విధ్వంసకర ఆలోచనలతోనే ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు.