ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువత చక్కని లక్ష్యంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి: మంత్రి జోగి రమేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 02:50 PM

జ్ఞానానికి కొలమానం లేదని, చక్కని లక్ష్యంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్ యువతకు పిలుపునిచ్చారు. పెడన పట్టణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ స్థిరపడేందుకు ఉద్యోగం తొలి అడుగని, అదే జీవితాన్ని మార్చి వేస్తుందని, స్వశక్తితో సంపాదించుకున్న ఉద్యోగం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. పది పన్నెండు వేలు జీతం ఒక ఉద్యోగం కాదనే భావన యువత మనస్సు నుంచి వీడాలన్నారు.


వేయమైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలన్నారు. విద్యావంతులు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే, వారి పట్ల మన సమాజంలో ఎంతో చులకన భావన ఉందన్నారు. మంచి ఆలోచనతో కొంతమందికైనా ఆధారం చూపాలని ఆలోచనతో నిర్వహకులు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.


కియా మోటార్స్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, ఆరబిందో ఫార్మా , అపోలో ఫార్మా , మెడ్ ప్లస్ ఫార్మా, ఈ కార్ట్ లాజిస్టిక్స్ లాంటి బహుళ జాతి సంస్థలు, ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలైన చందు సాఫ్ట్, టెక్ తమ్మిన ఈ జాబ్ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని దాదాపు1500 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అందుకు తగినట్లుగా వేలాదిమంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే, ఇక్కడ యువత ఉద్యోగం చేయడం పట్ల ఎంతో ఆసక్తి కనబరచడం గొప్ప పరిణామం అన్నారు పెడన నియోజవర్గం పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఈ జాబ్ మేళాకు తరలివచ్చారు. 20కి  పైగా మల్టీ నేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించబోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.   మంత్రి జోగి రమేష్ అంతకు ముందు గూడూరు గ్రామం నుంచి పెడన వెళ్లే మున్సిపల్ పైపులైను మరమ్మత్తులు నిమిత్తం 55 లక్షల రూపాయల వ్యయంతో పనుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన శంకుస్థాపన చేశారు.


ఈ కార్యక్రమంలో పెడన మున్సిపల్ చైర్మన్ బి. జి. ఎల్. జ్యోత్స్నరాణి , పెడన ఎంపీపీ ఆర్. వాణి పెడన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జి. చారుమతి, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన రావు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాసరావు, పెడన మూడో వార్డు కౌన్సిలర్ బి. గంగయ్య సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ జోజి రెడ్డి, ఫాదర్ అనిల్ ఫ్రాన్సిస్, ప్రిన్సిపల్ పి. రాజీవ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ఉద్యోగులు, పల్లోటి స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com