ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ లో ఓ వ్యక్తి వాటర్ బాటిల్ తో దాడికి యత్నించాడు. ఢిల్లీలో బలమైన పార్టీగా పునాదులు వేసుకున్న ఆమ్ అద్మీ పార్టీ ఆ తర్వాత పంజాబ్ లో కూడా ఘన విజయం సాధించి అక్కడ అధికారాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఆప్ అధినేత కేజ్రీవాల్ కన్ను గుజరాత్ పై పడింది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత ఇలాకాలో ఎలాగైనా గెలుపొంది తీరాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ లో అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది చివరి నాటికి ముగియనుంది. దీంతో అక్కడ మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో జెండా పాతడానికి కేజ్రీవాల్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తరచూ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
ఆమ్ అద్మీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే పాలనలో చేపట్టే మార్పుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా తాము అమలు చేయబోయే పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ రాష్ట్రంలో జరిగిన ఓ సభకు ఆయన హాజరు కాగా ఒక వ్యక్తి ఆయన వైపుగా ఒక వాటర్ బాటిల్ విసరడం కలకలం సృష్టించింది. అయితే అది కేజ్రీవాల్ ను తాకలేదు. ఆయనను దాటుకుంటూ వెళ్తూ పక్కన పడిపోయింది.
కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వెనకవైపు నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి వాటర్ బాటిల్ విసిరాడు. అయితే కేజ్రీవాల్ దీనిని పట్టించుకోకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కాగా గుర్తుతెలియని వ్యక్తి వాటర్ బాటిల్ విసిరిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో నమోదు కావడంతో.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.