భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం భద్రాద్రి రామయ్య కళ్యాణం కన్నులపండుగగా సాగింది. పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి కళ్యాణ మూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చి నిత్యకళ్యాణతంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణ తంతును కన్నులపండుగగా నిర్వహించారు. దసరా పండుగ సెలవులు కావడంతో అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు.