మహిళా కమీషన్ ను రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ విమర్శల కోసం చైర్ పర్సన్ వాడుకుంటున్నారని తెలుగు మహిళా హిందూపురం పార్లమెంట్ ప్రధానకార్యదర్శి గాండ్ల రామసుబ్బులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనకు స్పందించారు సంతోషం. పార్టీలకతీతంగా మహిళలను వేధించేది ఎవడైనా చర్యలు తీసుకోవాల్సిందే. అతడు వాలంటీర్ అయినా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, సీఎం అయినా. ఎవడైనా ఖచ్చితంగా శిక్షించాల్సిందే.
అయితే ఇక్కడ ప్రజలకు అర్ధం కాని విషయం ఏంటి అంటే. రాజకీయ లబ్ధి ఉన్నప్పుడే మహిళా కమీషన్ చైర్ పర్సన్ స్పందిస్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపుగా 40 వరకు అఘాయిత్యాలు జరిగాయి. నిందితుల్లో పలువురు వాలంటీర్లు ఉన్నారు. వైసీపీ నాయకులు ఉన్నారు. సామూహిక అత్యాచారం చేసి, హత్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇన్ని సార్లలో నువ్వు ఎప్పుడు స్పందించావు?
మొన్నటికి మొన్న స్థానిక సీఐ ఒక మహిళను దారుణంగా కొడితే, ఇక్కడి మహిళా కమీషన్ సభ్యురాలు కూడా స్పందించింది. జాతీయ మహిళా కమిషన్ కేసు కట్టమంది. నువ్వు మాత్రం నోరు మెదపలేదు. అంటే ఎక్కడెక్కడ వైసీపీ కి రాజకీయంగా ఉపయోగపడతానో, అక్కడ మాత్రం బయటకు వచ్చి రాజకీయ విమర్శలు చేస్తాను అని నిర్ణయించుకున్నావా? స్నేహలత అనే ఎస్సీ యువతిని చంపి, కిరాతకంగా కాల్చినప్పుడు, తేజస్విని అనే ఫార్మసీ విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసినప్పుడు, ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డర్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసు అప్పుడు తమరు ఎక్కడున్నారు? వైసీపీ వాళ్ళ అఘాయిత్యాలు ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. ఇతరుల గురించి ఏమైనా దొరుకుతుంది అంటే ఒంటి కాలి మీద లేచి వస్తారు?
నిష్పాక్షికంగా, రాగ ద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించడం అంటే ఇదేనా? సిగ్గు పడండి. కేవలం సత్యసాయి జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలు ఇక్కడ పెడుతున్నాను. వీటిలో ఎప్పుడైనా, ఒక్కసారైనా నువ్వు స్పందించావా చూసుకో? వీళ్ళందరూ ఆడపిల్లలు కారా? ఈ స్త్రీలకు నీ కమీషన్ పని చేయదా? మీకు మనస్సాక్షి ఉంటే ప్రశ్నించుకోండి. అందరు మహిళలను సమానంగా చూసి, సమన్యాయం చేయండి అని కోరారు.