మూడు రాజధానుల విషయంలో వైసీపీ జనంలోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. తాజాగా మంత్రి చేసిన ఓ ప్రకటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతూ రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు పోటీగా మరో పాదయాత్రను ప్రారంభించనున్నట్టు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మాట్లాడుతూ.. పాదయాత్ర పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే అందుకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదని మంత్రి స్పష్టం చేశారు. వివాదాస్పదమైన పాదయాత్రను ఆపివేయాలని రైతులను కోరారు. అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు కూడా ప్రత్యేక రాష్ట్రాలను కోరుకుంటారని అన్నారు. అదే జరిగితే అప్పుడు అమరావతిని కూడా వదులుకోవాల్సి ఉంటుందన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ తరపున పోటీ పాదయాత్ర నిర్వహిస్తామని, శాంతియుతంగా నిరసన తెలుపుతామని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే విశాఖపట్టణం నుంచి పరిపాలన సాగిస్తారని మంత్రి తెలిపారు. వచ్చే విజయ దశమి నాటికి విశాఖ పూర్తిస్థాయిలో రాజధాని కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా మరో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.