ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు అకస్మాత్తుగా మారిపోయాడు. సెప్టెంబర్ నెల 26వ తేదీన బాపట్లలో సంఘం నియమావళి ప్రకారం అన్ని చర్యలు తీసుకొని నిర్వహించిన ఎన్నికల్లో చీరాల తహసిల్దార్ జె. ప్రభాకరరావు అధ్యక్షునిగా ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అయితే ఇది జరిగి పది రోజులు కాకముందే శుక్రవారం అనూహ్యంగా అధ్యక్షుని మార్పు జరిగిపోయింది. ప్రభాకరరావు స్థానంలో కె. రాజా రమేష్ మోహన్ ఎన్నికైనట్లు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించి ఆ కార్యవర్గాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు పరిచయం చేశారు.
అయితే ఇక్కడ విషయమేమిటంటే జిల్లా కార్యవర్గం మొత్తం మారలేదు. కేవలం అధ్యక్షుడు ప్రభాకరరావును మాత్రమే మార్చడం జరిగింది. మిగతా కార్యవర్గమంతా యథావిధిగా కొనసాగుతోంది. కాగా అధ్యక్షుని మార్పు కూడా ఓ పద్ధతి ప్రకారం జరగలేదని సంఘం వర్గాలే చెబుతున్నాయి. రమేష్ మోహన్ ఎన్నికైనట్లు లాంఛనంగా ప్రకటన చేశారని వారు వివరించారు.
కాగా పది రోజుల్లో అధ్యక్షుని మార్పు ఎందుకు జరిగిందన్న విషయం ఆరా తీస్తే బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనకు గిట్టని ప్రభాకరరావును తొలగించే వరకు తెరవెనుక చాలా రాజకీయం చేశారని తెలియవచ్చింది. ప్రభాకరరావు స్వతహాగా సమర్థుడైన నాయకుడు. స్వతంత్య్ర భావాలు ఉన్న వ్యక్తి. రాజీ పడే తత్వం ఆయనకు లేదు. ఈ లక్షణాలు నచ్చకనే బొప్పరాజు ఆయనను పక్కకు తప్పించారని సర్వత్రా వినవస్తోంది. ఇదే ఇప్పుడు ఏపీఆర్ఎస్ఏ లో హాట్ టాపిక్.