మోడీ సర్కారు పాలనలో నిత్యావసరాల ధరలు షాకిస్తున్నాయి. ఇంధన రేట్లు ఆకాశమే హద్దుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయని అన్నమయ్య సిపిఎం కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ అన్నారు. రైల్వే కోడూరు సిపిఎం కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కారు ధరలను నియంత్రించటంలో విఫలమైందన్నారు. నిత్యవసరాల ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో మొబైల్ డేటా రేట్లు చౌక రేట్లకే లభిస్తే తమకేం ప్రయోజనమని దేశంలోని సామాన్య ప్రజానీకం ప్రశ్నింస్తున్నారన్నారు. మొబైల్ డేటా గురించి గుర్తు చేసిన మోడీకి దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్న ధరల పోట్ల గురించి తెలియదా అని ప్రశ్నించారు. మధ్య తరగతి కుటుంబం బడ్జెట్‌పై ఇంధన ధరల పెరుగుదల తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, ఇంధన ధరల పైనే నిత్యవసరాల ధరలు ఆధారపడి ఉండటమే దీనికి ప్రధాన కారణం అన్నారు. కార్పొరేట్ల గురించి చేసే ఆలోచనలో కొంతైనా సామాన్య జనం గురించి ఆలోచిస్తే వారికి ప్రయోజనం చేకూరుతుందని సిహెచ్ చంద్రశేఖర్ అన్నారు.