ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పడిన JACకి విశాఖలో శనివారం రాజీనామా లేఖను అందజేశారు. విశాఖలో ఈ నెల 15న భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ.. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. ముమ్మాటికీ అమరావతికి తాము వ్యతిరేకమేనని వ్యాఖ్యానించారు. వీకేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ తెలిపారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి వేల మందితో ర్యాలీ నిర్వంచనున్నట్లు తెలిపారు. భారీ నిరసన ప్రదర్శనతో రాజధాని ఆకాంక్షను బలంగా తెలియజేస్తామన్నారు. జేఏసీ అధ్వర్యంలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని కరణం ధర్మశ్రీ తెలిపారు.
రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అవంతి శ్రీనివాస్ మూడు రాజధానులకు మద్దతుగా అవసరమైతే రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఇప్పుడు కరణం ధర్మశ్రీ ఏకంగా స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా లేఖను ఇచ్చారు. దీంతో రానున్న రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అమరావతి రైతులు విశాఖలో అడుగుపెట్టనున్న క్రమంలో కావాలనే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.