కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో తీవ్ర విషాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని కారకాస్‌కు సమీపంలోని లాస్ టెజెరస్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనితో 22 మంది మృతి చెందగా మరో 52 మంది గల్లంతయ్యారు.ఈ ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని దేశ ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశ ముందని ఆయన వెల్లడించారు. నగరంలోని ఇళ్లు, వ్యాపార సముదాయాలు పెద్ద సంఖ్యలో నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. నెలరోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజులోనే పడటంతో భారీగా నష్టం జరిగిందన్నారు. లాస్ టెజెరాస్ ఘటనపై వెనెజులా అధ్యక్షుడు నికోలస్ ముదురో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కాగా, వెనెజులాలోని భారీ వర్షాల వల్ల దేశంలోని 23 రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.