రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు సుధీర్ఘకాలంగా ఉద్యమం చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి వైసీపీ మినహా అన్నిపార్టీలు మద్దతు తెలుపుతున్నారు. ఇదిలావుంటే అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మద్ధతు పలికారు. మహా పాదయాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కొనసాగుతుండగా, నందమూరి రామకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. పెనుగొండ, కవటం, మార్టేరు మీదుగా మూడు గంటలపాటు నందమూరి రామకృష్ణ పాదయాత్ర చేశారు. భారీవర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆయన రైతులతో కలిసి నడిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను అవమానిస్తూ హేళనగా మాట్లాడటం తగదన్నారు. వైసీపీ నేతలు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చుంటే భూమి విలువ ఏమిటో వారికి తెలిసేదని అన్నారు.
ప్రపంచంలో గానీ, దేశంలో గానీ ఎక్కడా మూడు రాజధానులు విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. నిజమైన పాలనా వికేంద్రీకరణను మండల వ్యవస్థ ద్వారా దివంగత నేత ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబునాయుడు హయాంలో కియా, హీరో, హోండా, ఇసుజు, అశోక్ లేలాండ్, మొబైల్ ఫోన్ల పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, 11 జాతీయ విశ్వవిద్యాలయాలను జిల్లాకు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేసి అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించారని అన్నారు. ఇదిలావుంటే నేటి పాదయాత్రలో మాజీమంత్రులు పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రాష్ట్ర ఉపాధి హామీ మండలి మాజీ సభ్యుడు వీరంకి గురుమూర్తి తదితరులు కూడా పాల్గొన్నారు.