స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం, మరోపక్క పచ్చదనం ఏర్పాటు చేయటం ద్వారా ఆరోగ్యబారత్ ఆవిష్కరణ సాధ్యమౌతుందని శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేష్ అన్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియన్ స్వచ్చతా లీగ్ కేటగిరీ లో శ్రీకాకుళం నగర పాలక సంస్థ కు ఉత్తమ అవార్డు ఇచ్చిన సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమీషనర్ బృందానికి స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ప్రతినిధులు సత్కరించి, వారి సేవలు కొనియాడారు. శ్రీకాకుళం నగరాన్ని సుందరీకరన చేయటంలో కమీషనర్ రేయింబవళ్లు పనిచేస్తూ, అన్ని వర్గాల ప్రజలకు పిలిస్తే పలికే దైవంగా పేరుగాంచారని వాకర్స్ ప్రతినిధులు కితాబిచ్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లక్ష నుండి మూడు లక్షల లోపు జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో శ్రీకాకుళం నగర పాలక సంస్థకు జాతీయస్థాయిలో ఇండియన్ స్వచ్ఛతా లీగ్ అవార్డ్ దక్కిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ 2022 కింద అన్ని కేటగిరీలు కలుపుకొని 11 జాతీయస్థాయి అవార్డ్స్ లభించాయి. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో 50 వార్డులకు గాను ప్రణాళికా బద్ధమగా పారిశుధ్య కార్మికులు పనులు చేపట్టడం వల్ల ఇది సాధించామని అన్నారు. శ్రీకాకుళం నగరం దినదినాభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్రస్థానంలో ఉందని, ఇక్కడ పౌరులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు వినియోగించి అన్ని రకాల సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని, ప్రజాప్రతినిధులు, ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని కమీషనర్ ఓబులేశ్ అన్నారు.
కమీషనర్ బృందాన్ని అభినందించిన వారిలో వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి. జి. గుప్తా, మాజీ గవర్నర్లు జి. ఇందిరా ప్రసాద్, కూన వెంకట రమణ మూర్తి, గుడ్ల సత్యనారాయణ, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, మారుతీ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కొంఖ్యాన మురళీ, వాకర్స్ ప్రతినిధులు బి. దేవీప్రసాద్, ఎం. ఏ. వి. సత్యనారాయణ, టి. హేమసుందర్ రాజు, కార్టూనిస్ట్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.