రాజధాని అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్గి రాజేస్తోంది. ఇదిలావుంటే ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 'అమరావతి నుంచి అరసవల్లి' మహా పాదయాత్ర పేరిట రాజధాని రైతులు చేపట్టిన యాత్రను పశ్చిమ గోదావరి జిల్లాలో అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. ఈ సందర్భంగా, యాత్రను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేయగా... వారికి నమస్కారం చేస్తూ అమరావతి రైతులు ముందుకు సాగారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఐతంపూడిలో చోటుచేసుకుంది.
మహా పాదయాత్రలో భాగంగా 30వ రోజు యాత్రను పెనుగొండ వాసవీ మాత ఆలయం నుంచి అమరావతి రైతులు నేడు ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఆచంట నియోజకవర్గాన్ని దాటి అమరావతి రైతులు తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. రైతుల యాత్ర ఐతంపూడి చేరుకోగానే... యాత్రకు నిరసన తెలుపుతూ వైసీపీ శ్రేణులు ప్లకార్డులు, నల్ల జోండాలు, నలుపు రంగు బెలూన్లతో రోడ్డుపై నిలిచారు. వారిని చూసిన అమరావతి రైతులు చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో యాత్ర ముందుకు సాగింది.