బెంగుళూరు డి. ఆర్. డి. ఓ అధర్వములో నడుస్తున్న డెబెల్ ప్రయోగశాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్విమ్స్ డైరెకర్ వెంగమ్మ, ప్రముఖ అంకాలజిస్ట్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జయచంద్ర బృందంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డెబెల్ డైరెక్టర్ డాక్టర్ టి. ఎం. కొట్రేష్, డెబెల్ సైంటిస్ట్ మోహనవేలు దగ్గరుండి ప్రయోగశాలలో బయో మెడికల్ ఇంప్లాంట్స్ తయారీ గూర్చి వివరించారు.
అనంతరం డెబెల్ సంస్థ అభివృద్ధి చేసిన ఎక్సో స్కెలిటన్ సిస్టం పరికరాన్ని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్వయంగా పరీక్షించారు. మానవ శరీరం లోని కీళ్లు, ఎముకలు బలహీనమైనప్పుడు, వివిధ కారణాలతో ఆపరేషన్ జరిగి రోగి నడిచేందుకు బాహ్య మద్దతు అవసరమైనపుడు ఈ ఎక్సో స్కెలిటన్ సిస్టం ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే వారు అభివృద్ధి పరచిన కృత్రిమ శరీర భాగాలు వివిధ కారణాల వలన కాలు, చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడే జాయింట్ లను అభివృద్ధి చేయనున్నారని చెప్పారు. శాంపిల్ జాయింట్ లను డెబెల్ సంస్థ వారు ఎంపీ బృందానికి ఆందజేశారు.
అనంతరం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ చర్చలు సంతృప్తి కరంగా ముగిశాయని, డెబెల్ ప్రయోగశాల పరిశీలించామని నాణ్యమైన బయో మెడికల్ ఇంప్లాంట్స్ దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని అవగాహనా ఒప్పందం చేసుకొనేందుకు ఇరుపక్షాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని ఈ నెలాఖరు లోపల అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనున్నామని అయన చెప్పారు.