విశాఖపట్నం: ప్రభుత్వాసుపత్రి భవనాలు పాతవి కావడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు పైకప్పు కారిపోతోంది. మహిళా వార్డులో కొన్ని పడకలపైకి నీరు పడుతోందిదీంతో రోగులను వేరే పడకలపైకి మారుస్తున్నారు. ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రి భవనం ఆంగ్లేయుల కాలంలో నిర్మించింది. ఈ పురాతన భవనానికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులతో రంగులు వేయించడం తప్ప శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. ఇంతలో ఆసుపత్రి కొత్త భవనానికి నిధులు మంజూరు కావడంతో ఎలాగూ ఆసుపత్రిని కొత్త భవనంలోకి మారుస్తారు కదా అని పాత భవనాలను పట్టించుకోలేదు. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో పైన స్లాబ్ అంతా నానిపోయి నీరు లోపలికి చిమ్ముతోంది. వార్డులో మినహా మిగిలిన అన్నిచోట్లా ఇబ్బందులు కలగపోవడంతో దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదు.
ఆసుపత్రిలో మరుగుదొడ్లు పాడయ్యాయి. ఓపీకి వెళ్లే మార్గం గతంలో పెచ్చులూడిపడింది. వందేళ్ల కిందట ఆంగ్లేయులు ఆయుధాగారం కోసం నిర్మించిన భవనం స్వాతంత్య్రం వచ్చాక ఆసుపత్రి భవనంగా మారింది. వైద్య విధాన పరిషత్‌లోకి విలీనం అయ్యాక ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగవుతాయని అందరూ భావించారు. హోదా పెరిగినా సౌకర్యాలు కల్పించలేదు. మందులు నిల్వచేసే స్టోర్ రూం అగ్నిప్రమాదానికి గురై సగం పాడైపోయింది. ఇందులోనే గోదాము కొనసాగిస్తున్నారు. ఆసుపత్రి భవనాల వెనుక భాగం శుభ్రం చేయకపోవడం వల్ల గోడల పగుళ్లలో మొక్కలు మొలిచాయి. భవనాలు దెబ్బతినడానికి ఇవీ ఓ కారణంగా చెప్పొచ్చు. డయేరియా వార్డు పాడైపోవడంతో దీన్ని స్టోర్ రూమ్‌గా వాడుతున్నారు. సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగింది. కారిపోతున్న భవనాలపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని పురప్రజలు కోరుతున్నారు.