సాంప్రదాయ పంటలు సాగుతో పాటు పండ్ల తోటలు సాగు చేపట్టడం ద్వారా రైతులకు సంవత్సరం అంతా ఆదాయం పొందవచ్చని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ ఆర్. హరిబాబు అన్నారు. రణస్థలం మండలం సమీప కోస్టా గ్రామంలో శ్రీ రాధా కృష్ణ మందిరం గోశాల ఆశ్రమం ప్రక్కన గల తమ నర్సరీని సంప్రదించి కావాల్సిన మొక్కలు పొందవచ్చని అన్నారు. పండ్లతోటల పెంపకం వలన పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాక గ్రామీణ ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు ఆహారంతో పాటు అనుబంధ పోషకాహారంగా కూడా ఉపయోగ పడుతుందని, దీనివలన శారీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.
పండ్లలో ఉన్న వివిధ రకాల విటమిన్లు కాలానికి అనుగుణంగా వచ్చే కొన్ని రకాల వ్యాధులకు నయం చేయడంలో సహాయపడుతుంది అన్నారు. అంతేకాక ప్రకృతి పరంగా జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉందన్నారు. ఉద్యాన తోటల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న రైతులను ప్రోత్సహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50% రాయితీపై సగం ధరకే మామిడి, జీడి మామిడి, సపోటా, నిమ్మ, కమలా, జామ వంటి పండ్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాలకు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాంతీయ సమన్వయకర్త బి. లక్ష్మీ నరసింహ మూర్తి చరవాణి సంఖ్య 9985542547 లో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.