చాలా మంది బాగా చదవాలనుకున్నా చదవలేని పరిస్థితి ఉంటుంది. ఇంకొందరికి పేదరికం, కుటుంబ సమస్యల వల్ల చదువుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి సమస్యలు వేధిస్తున్నా పట్టించుకోకుండా ఓ వ్యక్తి అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు. అంటెండర్‌గా పనిచేసిన కాలేజీకే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వెళ్లాడు. తాజాగా బిహార్ విశ్వవిద్యాలయ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఈ ఉద్యోగాన్ని పొందాడు. బిహార్ భాగల్పుర్ ముండిచక్కు చెందిన కమల్ కిషోర్ మండల్‌కు చదువంటే ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు మానేసి నైట్ వాచ్‌మన్‌గా పనిచేశాడు.
42 ఏళ్లున్న కిషోర్‌కు 2003లో ముంగేర్ కాలేజీలో వాచ్‌మన్‌గా ఉద్యోగం రాగా ఆ తర్వాత 2008లో అక్కడి నుంచి డిప్యుటేషన్‌పై అంబేడ్కర్ పీజీ కళాశాలకు అంటెండర్‌గా వెళ్లారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. పీజీ కళాశాలకు అంటెండర్‌గా వెళ్లిన కిషోర్ 2013లో పీజీ పూర్తి చేశారు. 2017లో పీహెచ్‌డీలో పేరు నమోదు చేసుకున్నారు. 2019లో పీహెచ్డీ సైతం పూర్తి చేసి జాతీయ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించారు. 2020లో బిహార్ రాష్ట్ర విశ్వవిద్యాలయ సర్వీస్ కమిషన్ నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా అందులో ఉత్తీర్ణత సాధించి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని పొందాడు.