ఐదారు జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలను పవన్ కల్యాణ్ విశాఖ తరలించారని, వారంతా మద్యం మత్తులో తమపై దాడులకు పాల్పడ్దారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ఈ దాడిలో తమ పార్టీకి చెందిన కిరణ్, దిలీప్ అనే ఇద్దరు కార్యకర్తలకు రక్త గాయాలయ్యాయని ఆయన అన్నారు. విశాఖలో వైసీపీ కీలక నేతల కార్లపై జనసేన శ్రేణులు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. విశాఖలో శనివారం వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనకు హాజరైన వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకోగా... అప్పటికే పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వైసీపీ నేతల కార్ల అద్దాలు పగిలిపోగా... వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఈ వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్‌తో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మాట్లాడారు. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని ఆయన పేర్కొన్నారు. జనసేన శ్రేణులు చిల్లర యవ్వారాలకు పాల్పడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేదో కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు వస్తే... విమానాశ్రయానికి వచ్చిన తమపై దాడి చేయడం మంచి పద్దతి కాదని జోగి రమేశ్ అన్నారు. చిల్లర గాళ్లను పిలిపించుకుని వారిని అరాచకవాదులుగా మార్చే దిశగా పవన్ యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ కార్లపై జనసైనికులు కర్రలు తీసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇదేమీ మంచి పద్దతి కాదన్న రమేశ్... ఇప్పటికైనా పవన్ తన అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో వైసీపీ శ్రేణులు తలచుకుంటే పవన్ ఎక్కడ కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు.