విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ వద్ద వైయస్ఆర్‌సీపీ నాయకులు, మంత్రులపై జనసేన సైనికుల దాడికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ డిమాండు చేశారు. విశాఖ గర్జనకు వచ్చిన మంత్రులు.. ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో.. మంత్రుల కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. వారు జన సైనికులు కాదు.. జన సైకోలని మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్, సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి కార్లపై కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడటాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుశ్చర్యలు మంచివి కావని హితవు పలికారు.
విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే జనసేన దాడులకు తెగబడుతోందని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మండిపడ్డారు.పవన్ కల్యాణ్ రౌడీయిజం చేస్తున్నాడా..? జనసేనకు వందమంది కార్యకర్తలు ఉంటే.. మాకు 10 వేల మంది ఉన్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇలాంటి దాడులు సరికాదని హితవు పలికారు.