అమరావతి రైతుల పాదయాత్ర 36వ రోజు కొనసాగుతోంది. ఈరోజు ఉదయం కొవ్వూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు ఇవాళ మొత్తం 15 కిలోమీటర్లు నడవనున్నారు. హోంమంత్రి తానేటి వనిత సొంత నియోజక వర్గం కావడంతో.. రాజధాని రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు విధించారు. గామన్ బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు అభ్యంతరం తెలిపారు. రూట్ మార్చుకోవాలని జేఏసీ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు.. రెండురోజుల కిందట ప్రయత్నించారు. అయితే నోటీసులు తీసుకునేందుకు జేఏసీ నేతలు నిరాకరించారు. దీంతో కొవ్వూరులో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కాగా అమరావతి రైతుల పాదయాత్రకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలపాలని కొవ్వూరు టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణారావు అన్నారు. పాదయాత్రకు రాష్ట్ర కాపు సంఘం నాయకుడు వంగవీటి రాధ మద్దతు తెలియజేయడానికి కొవ్వూరు విచ్చేస్తున్నట్టు కొవ్వూరు నియోజకవర్గ కాపునాడు గౌరవాధ్యక్షులు ముత్యాల రాంబాబు తెలిపారు. కాపు సోదరులు మద్దతుగా నిలవాలన్నారు.