కమ్యూనికేషన్ (టెలిఫోన్) సౌకర్యాలతో పనిచేసే ఇంటర్నెట్ ఆధారిత టెక్నాలజీ మనిషికి అన్ని అవసరాలు తీర్చుతాయని, ఎనలేని సంపద సృష్టిస్తాయనే గుడ్డి నమ్మకంతో ఎంఏ (ఆర్థికశాస్త్రం) చదివిన చంద్రబాబు పాలన సాగించారు. ఒక్క టెక్నాలజీని నమ్ముకుంటే ప్రజల అవసరాలు తీరడమేగాక, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేరతాయని ఆయన విశ్వసించారు. ఐటీ రంగమే తనను 2020 దాకా అంటే పాతికేళ్లు (1995–2020) బ్రేక్ లేకుండా ముఖ్యమంత్రి పీఠంపై కదలకుండా కూర్చోబెడుతుందని చంద్రబాబు ఆశించారు. ఆయన ఆశలు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అడియాశలయ్యాయి. అయినా, తాను ఊహించుకున్న ‘టెక్నాలజీ’పై కుప్పం ఎమ్మెల్యేకు నమ్మకం సడలలేదు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉన్నాగాని బాబు గారిలో మార్పు రాలేదు. సీఎం గద్దె నుంచి దిగిపోయాక ‘తాను మరానని’ పార్టీ నేతలు, కార్యకర్తల ముందు ప్రకటనలు గుప్పించిన చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో అనూహ్యంగా వచ్చిన అధికారంతో మరోసారి ‘టెక్నాలజీ మత్తు’ ఎక్కింది. 2014–19 మధ్య కాలంలో విభజిత రాష్ట్రంలో ఇంటింటికీ ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి మరో ఐదేళ్లు రాజ్యమేలాలని ఆయన భావించారు. కాని, ఎందుకనో ఆయన పథకం ఆచరణలో సాధ్యం కాలేదు. 27 ఏళ్ల అనుభవం తర్వాత కూడా తాను అనుకునే ‘టెక్నాలజీ’యే మనిషికి అన్నీ సమకూర్చుతుందని చంద్రబాబు నమ్ముతున్నారు. టెక్నాలజీకి ఉన్న పరిమితుల గురించి నిపుణులు, ఓటర్లు మూడుసార్లు (2004, 2009, 2019) చెప్పినా మాజీ సీఎం గారికి అర్ధంకాలేదు అని సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.