బంగారం కొనడానికి ధన్‌తేరాస్, దీపావళి పండగ సమయాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రోజులలో బంగారం అమ్మకాలు పెరుగుతూ ఉంటాయి. ఈసారి అయితే బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగొచ్చాయి. ఒకవేళ మీరు బంగారాన్ని పెట్టుబడి సాధనంగా కొనాలనుకుంటే, ఆర్‌బీఐ జారీ చేసే సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టడం మంచిది. అది అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం. పైగా మంచి రిటర్నులను కూడా ఇస్తుంది. చాలా భారతీయ కుటుంబాలు బంగారం కొనడానికి దీపావళిని ఉత్తమ సమయంగా భావిస్తాయి. దీపావళి నాడు బంగారం కొనడం లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకురావడం మరియు సంపద మరియు శ్రేయస్సుతో మనకు అనుగ్రహించడంతో ముడిపడి ఉంటుంది.
దీపావళి పండుగ మొదటిరోజు ధన్ తేరాస్‌లో బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీ. హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని పదమూడో రోజున ధనద్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజుల్లో మీరు బంగారం కొంటే మీ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే అవుతుంది. బంగారం, వెండి వస్తులను కొని వాటిని బీరువాలో దాచడం మంచి ఫలితాలను ఇస్తుంది. బంగారం కొనడానికి ఇప్పుడు షాపింగ్ కు వెళ్లాల్సిన పని లేదు. మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇంట్లో నుంచే కొనుగోలు చేయొచ్చు. బంగారం కొనడమే కాకుండా బ్యాంకులో తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకుని ఇంటికి తీసుకురావచ్చు. అలా చేసినా కూడా మీ ఇంట సిరిసంపదలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.