వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జరిగిన గర్జన రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ప్రజల ఆకాంక్షను ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి విశాఖకు వెళ్లిన పవన్ రాష్ట్ర ప్రజల దృష్టిలో మాత్రం ఒక ద్రోహిగా మిగిలి పోయాడన్నారు. పవన్ కల్యాణ్ మాటలు విని ఏ ఒక్క కాపు సోదరుడు అయినా, చంద్రబాబుకు సహకరిస్తే.. వంగనీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందన్నారు. స్వర్గీయ వంగవీటి రంగా హత్యతో తనకు సంబంధం లేదని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలవా..? అని చంద్రబాబును మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ... రాష్ట్రం అంతా బాగుండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోరుకుంటుంటే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అమరావతి మాత్రమే బాగుండాలని కోరుకోవడం, దీనికి పవన్ కల్యాణ్ తన వెనుక తిరిగే ఫ్యాన్స్ ఆవేశాన్ని వాడుకుంటూ, ఫ్యాన్స్ ఆవేశాన్ని ప్యాకేజీ కోసం చంద్రబాబుకు అమ్ముకోవడాన్ని ఏమనాలి..?, దీన్ని ఏ రాజకీయం అనాలి..? అని ప్రశ్నించారు.