బాజీ జంక్షన్ వద్ద ప్రభుత్వ స్థలంలో ఆక్రమ నిర్మాణంపై జోన్8 టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝళిపించారు. ఏసీపీ ఆదేశాల మేరకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అనిత నేతత్వంలో అక్రమ నిర్మాణాన్ని సిబ్బంది తొలగించారు. గతంలో నిర్మాణాలు చేపడుతున్న సమయంలో అడ్డుకుని హెచ్చరించారు. కొన్ని రోజులు విరామం ఇచ్చి ఇక్కడి ప్రభుత్వ స్థలంలో స్థానికుడు సోమవారం నిర్మాణం ప్రారంభించాడు. జీవీఎంసీ, సచివాలయం టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం ఆక్రమిత స్థలం వద్దకు చేరుకుని పనులను నిలిపి వేశారు. నిర్మాణదారుల వద్ద స్థలం తాలూక డాక్యుమెట్లు లేవని ఇది ప్రభుత్వ స్థలమని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ పంప్ హౌస్ ఉండేది. ఈ పంప్ హౌస్ ప్రాంతంలో ఫిల్లర్లు వేసి భారీ నిర్మాణానికి సన్నదమయ్యారు. ఇది ప్రభుత్వ స్థలం కావడంతో ఇక్కడ మంజూరయిన హౌసింగ్ స్కీమ్ కూడా రద్దయిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై కోర్టులో స్టే ఉందని నిర్మాణ దారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలలో నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.