పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే, జనసేన పార్టీ టీడీపీ అనుబంధ విభాగం కాకుంటే, పవన్ ప్యాకేజీ తీసుకోలేదని నిరూపించుకోవాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల పోటీ చేయాలని, అప్పుడు ప్యాకేజీ తీసుకోలేదని నమ్ముతామని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పవన్ కల్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని, ప్యాకేజీలు తీసుకునే వ్యక్తిని ప్యాకేజీ స్టారే అంటారన్నారు. గతంలో మీ తల్లిని తిట్టించిన టీడీపీ, ఎల్లో మీడియా తిట్లు నేడు ఆశీర్వచనాలయ్యాయా..? అని పవన్‌ను ప్రశ్నించారు. విడిపోయిన బంధం మళ్లీ కలవడానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో పవన్ సమాధానం చెప్పాలన్నారు. విశాఖ గర్జన తరువాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామ్య పరిస్థితులు ఏం ఉన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులపై దాడి చేయడం ప్రజాస్వామ్యమా..? మంత్రులపై దాడిచేసిన వారిని పరిగెత్తుకుంటూ వెళ్లి పరామర్శిస్తారా..? అని నిలదీశారు. ప్రస్తుత మంత్రి రోజాను గతంలో ఏడాదిపాటు సస్పెండ్ చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా..? చంద్రబాబుకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకువచ్చిందా..? అని మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు.