కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకి, బోయల చిరకాల వాంఛ నెరవేరేలా చూడాల్సిన సీఎం రాజకీయ కుట్రతో సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని టీడీపీ నాయకులూ కాల్వ శ్రీనివాసులు ఓ ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలో వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చే అంశాన్ని అధ్యయనం చేయడానికి కొత్తగా ఏకసభ్య కమిషన్ నియామకం ద్వారా జగన్‌రెడ్డి ప్రభుత్వం బోయలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీతో శాస్త్రీయంగా అధ్యయనం చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిందన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చే అంశంపై మూడున్నరేళ్లలో కేంద్రంతో ఏనాడూ చర్చించలేదన్నారు. ఏకసభ్య కమిషన్ ఉత్తర్వులు రద్దు చేసి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కమిషన్ పేరుతో కాలయాపన చేస్తే వాల్మీకి, బోయల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.