ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి రోజులు జయలలిత అలా గడిపారు...ఆసక్తికర నివేదిక అసెంబ్లీకి

national |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 11:10 PM

తన చివరి రోజుల్లో తమిళనాడు సీఎం జయలలిత ఎలా గడిపారు అన్న దానిపై తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. దాంట్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. పురచ్చితలైవిగా కోట్లాదిమందికి ఆరాధ్యదేవతలా వెలిగిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత 2016 డిసెంబరు 5న కన్నుమూయడం తెలిసిందే. ఇప్పటికీ ఆమె చివరి క్షణాల్లో ఏం జరిగిందన్నది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 75 రోజుల పాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందినా, ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పటి ఒక్క ఫొటో కూడా లేదు. దాంతో 'అమ్మ' మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. 


ఈ నేపథ్యంలో, జయలలిత మరణం, అందుకు దారితీసిన పరిస్థితులపై నిగ్గు తేల్చేందుకు గతంలో తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ అర్ముగస్వామి కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రూపొందించిన నివేదిక ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి చేరింది. దీంట్లో అత్యంత ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. జయలిలత సన్నిహితురాలు శశికళ చెప్పిన విషయాలను కూడా జస్టిస్ అర్ముగస్వామి తన నివేదికలో పొందుపరిచారు. ఈ వివరాలను శశికళ తన స్టేట్ మెంట్లో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. 


"2016లో అక్క (జయలలిత)కు శరీరంపై దురదతో కూడిన దద్దుర్లు రావడం మొదలయ్యాయి. శరీరంపై అనేక చోట్ల సోరియాసిస్ వ్యాపించింది. దైనందిన ప్రభుత్వ పాలనా వ్యవహారాలను అక్క అతికష్టమ్మీద నిర్వర్తించేది. ఆ సమయంలో డాక్టర్లు కొద్దికాలం పాటు స్వల్ప మోతాదులో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. దాంతో చర్మ సంబంధ సమస్యల నుంచి ఆమెకు ఉపశమనం కలిగింది. డాక్టర్లు క్రమంగా ఆమెకు స్టెరాయిడ్ల డోసు తగ్గించుకుంటూ వచ్చారు. 


2016లో సెప్టెంబరు 21న ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్క తీవ్ర జ్వరం బారినపడ్డారు. దాంతో ఆమె వెంటనే ఇంటికి వచ్చేశారు. ఆ మరుసటి రోజు... అక్క నీరసంగా కనిపించడంతో ఆసుపత్రిలో చేరాలని సూచించాను. అయితే అక్క అందుకు అంగీకరించలేదు. అయితే బాత్రూంకు వెళ్లిన అక్క ఉన్నట్టుండి నన్ను పిలిచింది. నాకు కళ్లు తిరుగుతున్నాయి శశీ... ఇలారా అంటూ అరిచింది. దాంతో పరుగు పరుగున వెళ్లి అక్కను బాత్రూం నుంచి తీసుకుని వచ్చి మంచంపై కూర్చోబెట్టాను. అక్క ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి నా భుజంపై ఒరిగిపోయింది" అంటూ శశికళ వివరించారు. 


ఇక, రెండున్నర నెలల పాటు ఆసుపత్రిలోనే గడిపిన జయలలిత ఆ సమయంలో భక్తి పాటలు వింటూ, ఆసుపత్రి గదిలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్ర పటాలు చూస్తూ గడిపినట్టు అర్ముగస్వామి కమిషన్ నివేదికలో పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించేంత వరకు జయలలిత భక్తిపాటలు విన్నారని శశికళ తన వాంగ్మూలంలో వెల్లడించారు. 


జయలలితకు ఇష్టమైన భక్తిపాటలను ఆమె అనుచరులు ఓ యూఎస్ బీ డ్రైవ్ లో లోడ్ చేసి తనకు అందించారని, ఆ డ్రైవ్ ను తాను జయలలితకు ఇచ్చానని వివరించారు. అంతేకాదు, అక్క కంటికి పచ్చదనంతో ఇంపుగా ఉండేలా ఆసుపత్రి గదిలో ప్లాస్టిక్ మొక్కలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇదిలావుంటే తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ తో జయలలిత పుస్తకాల గురించి మాట్లాడేదని, చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ ప్రస్థానానికి సంబంధించిన 'ప్రైవేట్ లైఫ్ ఆఫ్ మావో జెడాంగ్' పుస్తకం చదవాలని ఆ డాక్టర్ కు సూచించిందని శశికళ వెల్లడించారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో ఆ పుస్తకం సాయపడుతుందని అక్క చెప్పేవారని పేర్కొన్నారు. 


"క్రమంగా అక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆమెకు ట్రాకియోస్టమీ నిర్వహించారు. ఈ వైద్య ప్రకియ మొదలైన 10 రోజుల తర్వాత, తనకు అమర్చిన ఆహార ట్యూబును తొలగించాలని ఆమె డాక్టర్లను కోరారు. ఆ ట్యూబు అసౌకర్యం కలిగిస్తోందని తెలిపారు. అక్కకు అపోలో ఆసుపత్రి కిచెన్ లో ప్రత్యేకంగా తయారుచేసిన ఇడ్లీ, పొంగల్, వడ వంటి అల్పాహారాలను వైద్యుల పర్యవేక్షణలో అందించేవారు" అని తెలిపారు. ఇక జయలలిత చివరి క్షణాలను కూడా శశికళ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. 


"అత్యవసరంగా జయలలిత వద్దకు రావాలంటూ డాక్టర్లు కబురు పంపించారు. నేను వెళ్లి చూసేసరికి అక్క నాలుక బయటకు పొడుచుకుని వచ్చి ఉంది. శరీరం అదురుతోంది. అక్క పళ్లు కొరుకుతూ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతలో ఓ డాక్టర్... ఆమె చెవి వద్ద "అక్కా" అని గట్టిగా పిలవండి అని చెప్పారు. దాంతో "అక్కా అక్కా" అని గట్టిగా పిలిచాను. దాంతో అక్క రెండుసార్లు నన్ను చూసింది. ఆ తర్వాత ఆమె కళ్లు మూతపడ్డాయి. వెంటనే స్పందించిన డాక్టర్లు, నర్సులు హడావుడిగా ఆమెకు అత్యవసర చికిత్స అందించడం ప్రారంభించారు. నన్ను బయటికి వెళ్లమని సూచించారు. కానీ నేను "అక్కా అక్కా.. నా వైపు చూడక్కా" అంటూ ఆమెను పట్టుకుని కుదిపాను. కానీ అక్క బెడ్ పై చలనం లేకుండా వాలిపోయింది. ఆమె హార్ట్ అటాక్ కు గురైందని డాక్టర్లు చెప్పారు. దాంతో నేను భరించలేక స్పృహ కోల్పోయాను" అని శశికళ వెల్లడించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa