మళ్లీ బ్రిటన్ ప్రధాని ఎవరో అన్న చర్చ ఆ దేశంలో మొదలైంది. ఈ రేసులో రిషి సునాక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇదిలావుంటే మినీ బడ్జెట్ లో పన్నుల కోతల ప్రతిపాదనలు బెడిసికొట్టడం లిజ్ ట్రస్ కొంపముంచింది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో ఇప్పటికే ఆర్థికమంత్రి పదవి నుంచి క్వాసీ కార్టెంగ్ ను తొలగించిన లిజ్ ట్రస్... అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఎదుర్కోలేకపోయారు. ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్టు నేడు రాజీనామా ప్రకటన చేశారు. ప్రధాని పీఠం ఎక్కిన 45 రోజుల్లోనే ఆమె వైదొలిగారు.
ఇక తదుపరి ప్రధాని ఎవరన్న దానికి కన్జర్వేటివ్ పార్టీ నేత, ఇటీవల ఎన్నికల్లో లిజ్ ట్రస్ కు పోటీదారుగా నిలిచిన్ రిషి సునాక్ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాజీ ఆర్థికమంత్రి అయిన రిషి సునాక్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ ను నడిపించగలడన్న వాదనలు బలపడుతున్నాయి. మరోసారి బ్రిటన్ నాయకత్వం కోసం ఎన్నికలు జరిగితే రిషి సునాక్, జెరెమీ హంట్, పెన్నీ మోర్డాంట్ ల మధ్య ప్రధాన పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సునాక్, మోర్డాంట్ గత ఎన్నికల్లోనూ ప్రధాని రేసులో పోటీపడ్డారు. అయితే తుదిరేసులో లిజ్ ట్రస్, సునాక్ మిగిలారు. ఇప్పుడు సునాక్ ముందు బ్రిటీష్ ప్రధాని అయ్యే సువర్ణావకాశం నిలిచింది. బ్రిటన్ లోని బెట్టింగ్ కంపెనీలు కూడా సునాక్ ఫేవరెట్ అని పేర్కొంటున్నాయి. ప్రధాని రేసులో జెరెమీ హంట్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన మంత్రి పదవి చేపట్టిన కొన్నిరోజులే అయింది. అయినప్పటికీ ఫేవరెట్ల జాబితాలో హంట్ పేరు కూడా చేరింది. కాగా, తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని లిజ్ ట్రస్ వెల్లడించారు.