ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకొన్నారు.గత ఏడాది నౌషెరా సెక్టార్ లో సైనికులతో కలిసి వేడుక చేసుకున్న ప్రధాని ఈ సంవత్సరం కార్గిల్ లో సైనికులతో కలిసి దీపావళి పండుగ నిర్వహించుకున్నారు. తొలుత సైనికులకు ఆయన మిఠాయిలు పంచారు. అనంతరం వారిని పరిచయం చేసుకుని దీపాళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, మోదీ మాట్లాడుతూసైనికులే తన కుటుంబమని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం సైనికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. సైనికులవల్లే దేశంలో శాంతిభద్రతలు ఉన్నాయని పేర్కొన్నారు. సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలని ప్రధాని అభివర్ణించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా సైనిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్న ప్రధాని.. ఆధునిక ఆయుధాలను సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయాలను కూడా పెంచుతున్నామని వివరించారు. దేశంలో భారీ సంఖ్యలో సైనిక స్కూళ్ళను ఏర్పాటు చేసి, దేశానికి మరింత మంది సైనికులను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. భారత సైనిక రంగంలోకి మహిళలను కూడా ఆహ్వానించామని, ఇది గొప్ప పరిణామమని పేర్కొన్నారు. దేశ రక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని మోదీ ఉద్ఘాటించారు. సైనికులు సరిహద్దుల్లో ఉండి దేశాన్ని రక్షించినట్లే, తాము దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి వంటి దురాచారాలపై పోరాడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశ భద్రతకు ఆత్మనిర్భర్ భారత్ చాలా ముఖ్యమైనదని, విదేశీ ఆయుధాలు, వ్యవస్థలపై ఆధారపడటం తగ్గించాలని పేర్కొన్నారు. 400 రకాలకు పైగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోకూడదని త్రివిధ దళాలు నిర్ణయించడాన్ని తాను అభినందిస్తున్నానన్నారు. మన జవాన్లు మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో పోరాడడడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి భారత్ కట్టుబడి ఉందన్నారు. భారత్ శాంతి కాముక దేశమని..యుద్ధాన్ని ఎప్పుడూ.. స్వాగతించదని నొక్కి చెప్పారు. దేశంలో వలసవాదుల ఆలోచనలు.. వారి గుర్తులను పూర్తిగా తొలగిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తొలి అడుగుగా భారత నావికాదళంలో చరిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. భారత నావికా పతాకంలో తొలిసారి వీర శివాజీ స్ఫూర్తిని ప్రతిబింబించేలా చిహ్నంలో మా ర్పులు చేసినట్టు చెప్పారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్‌ను చూసి నేర్చుకుంటోందని భారత్ సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందని తెలిపారు.