ఎన్నో ఏళ్లుగా అంధకారంలో జీవిస్తున్న జోగినిల ఇళ్లల్లో శాశ్వత ప్రాతిపదికన కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయించారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఇటీవల శెట్టూరు పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా జోగినీలతో సమావేశమై వారి సాధకబాధకాలపై సమీక్ష చేశారు. తమ ఇళ్లకు కరెంటు సౌకర్యం లేదని... ఏర్పాటు చేయాలని జోగినీలు తెలియజేశారు. అంతే... వారు అడిగిన తక్షణమే విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ప్రత్యేకంగా 3 విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ తీగలు లాగించారు. జోగినీల ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్గించి ఆ ఇళ్లల్లో లైట్లు వెలిగించారు. జోగినీల ఇళ్లను జిల్లా ఎస్పీ ఈ రోజు సందర్శించారు. చీరలు, క్రాకర్స్ , స్వీట్లు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన సంకేతంగా జరుపుకునే ఈ పండుగ వేళ జోగినీలతో కలసి బాణసంచా కాల్చారు. జోగినీల మధ్య సంతోషంగా దీపావళి పండుగ సంబరాలు చేశారు.ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఇన్ఛార్జి డీఎస్పీ ప్రసాదరెడ్డి, రూరల్ సి.ఐ శ్రీనివాసులు, ఎస్సై యువరాజు, తదితరులు వెళ్లారు.