కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలను మల్లికార్జున ఖర్గే చేపట్టారు. సోనియా గాంధీ నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత గాంధీయేతరులు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ... పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేశానని చెప్పారు. ఈరోజుతో తనకు బాధ్యతల నుంచి విముక్తి కలిగిందని అన్నారు. తన భుజాల మీద ఎంతో బరువు తొలగిపోయినట్టుగా ఉందని చెప్పారు. ఎంతో రిలీఫ్ ఫీల్ అవుతున్నట్టుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించడం అతిపెద్ద బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు ఈ బాధ్యత ఖర్గే తీసుకున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని సోనియా చెప్పారు. ఈ సవాళ్లను తాము పూర్తి శక్తిసామర్థ్యాలతో, ఐకమత్యంతో ఎదుర్కొంటామని అన్నారు. అందరం కలిసి తమ లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై 80 ఏళ్ల ఖర్గే గెలుపొందారు. అయితే, ఈయన గెలుపుపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. గాంధీలకు విధేయుడు కాబట్టే ఖర్గే గెలిచాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.