రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని రష్యా రక్షణ మంత్రి షొయిగుకు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు. రాజ్ నాథ్ సింగ్ నేడు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ తమపై దాడి కోసం 'డర్టీ బాంబ్' సిద్ధం చేస్తోందని షొయిగు చెప్పగా, అందుకు రాజ్ నాథ్ స్పందించారు. భారత్ కోరుకుంటున్నది ఇదేనని ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా, ఉక్రెయిన్ అణ్వస్త్ర ప్రయోగానికి దిగరాదని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి అణుయుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని పేర్కొన్నారు.
కాగా, డర్టీ బాంబ్ పేరుతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని రష్యా గత కొన్నిరోజులుగా ఆరోపిస్తోంది. దీనిపై రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు తన మిత్రదేశాలకు సమాచారం అందిస్తున్నారు. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఇదే విషయాన్ని చెప్పిన ఆయన, చైనా ప్రభుత్వానికి కూడా డర్టీ బాంబ్ వివరాలను తెలియజేశారు. అయితే, ఉక్రెయిన్ డర్టీ బాంబ్ వేసే ప్రమాదం ఉందంటూ ప్రచారం చేసి, చివరికి ఆత్మరక్షణ పేరిట రష్యా ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సెర్గీ షొయిగు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుండడం కూడా సందేహాలకు తావిస్తోంది.