బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రుషి సునాక్ కార్లపై ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. ఇదిలావుంటే బ్రిటన్ 57వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ సంపన్న కుటుంబానికి చెందినవాడని తెలిసిందే. బ్రిటన్ లోని అత్యంత ధనికుల్లో రిషి సునాక్ 222వ స్థానంలో ఉన్నారు. ఆయన వద్ద పరిమిత సంఖ్యలోనే కార్లు ఉన్నా, అవి ఎంతో ఖరీదైనవి. ఈ భారత సంతతి నేత వద్ద ఫోక్స్ వాగన్ గోల్ఫ్ జీటీఐ, జాగ్వార్ ఎక్స్ జే ఎల్, లాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ సెంటినల్ వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. వీటిలో జాగ్వార్ ఎక్స్ జే ఎల్ మోడల్ కారు అత్యంత శక్తిమంతమైనది. ఇది మందుపాతరల పేలుడును కూడా తట్టుకోగలదు. ఇది అల్ట్రా లగ్జరీ సెడాన్ సెగ్మెంట్ కు చెందిన కారు.
లగ్జరీ మాత్రమే కాదు, అందులో ప్రయాణించేవారి భద్రతకు కూడా పెద్దపీట వేసేలా ఇందులోని ఫీచర్లు ఉంటాయి. కారు కింది భాగంలో 13 ఎంఎం మందంతో లోహపు ప్లేటు ఏర్పాటు చేశారు. కింది భాగంలో పేలుడు సంభవించినా, ఆ ఉక్కు ప్లేటు పేలుడును అడ్డుకుంటుంది. అంతేకాదు, కారు ఉపరితలంపై కెవ్లార్, టైటానియం కవచం ఉంటుంది. ఇది తుపాకీ గుళ్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. నిన్ననే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్ ఈ కారును ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు.
ఈ కారులో పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంకులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ జాగ్వార్ ఎక్స్ జే ఎల్ కారులో 3.0 లీటర్ టర్బోచార్జ్ డ్ వీ6 ఇంజిన్ అమర్చారు. ఇది 225 బీహెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 4 సెకన్లలోనే 100 కిమీ వేగం అందుకోగలదు. దీని ధర గరిష్ఠంగా రూ.1.97 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక, సునాక్ లండన్ నగరంలో విహరించేందుకు ఫోక్స్ వాగన్ గోల్ఫ్ జీటీఐ కారును ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది గంటకు 240 కిమీ వేగంత దూసుకెళ్లగలదు.