కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల భద్రతకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ మహేష్ శనివారం మధ్యాహ్నం చీరాల మండలం వాడరేవు బీచ్ లో పర్యటించారు. అక్కడి ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
అనంతరం అడిషనల్ ఎస్పీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ కార్తీకమాసం సందర్బంగా వాడరేవు, రామాపురం, మోటుపల్లి తదితర సముద్ర తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలకు పెద్దసంఖ్యలో రావడం పరిపాటి అని చెప్పారు. ఈ దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా గజ ఈతగాళ్లను నియమించామని, పడవలను సిద్ధం చేసి ఉంచామని తెలిపారు. అలాగే మెరైన్ పోలీసులు సైతం సదా అప్రమత్తంగా ఉంటారన్నారు. భక్తులు కూడా పోలీసు సూచనలను అనుసరించి సముద్ర స్నానాలు చెయ్యాలని అడిషనల్ ఎస్పీ మహేష్ కోరారు.
చీరాల డీఎస్పీ శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాసరావు, చీరాల రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఈపూరుపాలెం ఎస్సై జనార్ధన్, మెరైన్ ఎస్సై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు