గుజరాత్ ఎన్నికల్లో ఉమ్మడి పౌరస్మృతి అస్త్రం సంథించేందుకు బీజేపీ సన్నద్దమవుతోంది. మరో కొన్ని వారాల్లో గుజరాత్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఓ అత్యున్నత కమిటీని ఏర్పాటుచేస్తూ ఈ మేరకు శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల కోరుతున్న రాష్ట్రాల జాబితాలో గుజరాత్ కూడా చేరింది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ మేరకు గుజరాత్ హోం సహాయమంత్రి హర్ష్ సంఘ్వీ శనివారం మీడియాకు తెలిపారు.
‘‘క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం.. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు/హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది’’ అని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్విటర్‌లో వెల్లడించారు.
ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని గతంలోనే అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ హామీని ప్రకటించిన బీజేపీ.. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూసీసీని అమలుకు నిపుణులతో కూడిన అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ ఉమ్మడి పౌరస్మృతిపై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇక, గోవాలో ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. పోర్చుగీస్ సివిల్ కోడ్ 1867ను గోవా అనుసరిస్తోంది. ఇక ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే.. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి ఒకే చట్టం అమల్లో ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న హిందూ వివాహ చట్టం, 1955, హిందూ వారసత్వ చట్టం 1956 లేదా భారత వారసత్వ చట్టం 1925, షరియత్ చట్టం 1937 వంటివి ఇక చెల్లుబాటులో ఉండవు. అయితే ఈ యూసీసీని తీసుకొచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మేధావులు దీన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు స్వాగతించింది. అయితే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ‘ఇది దురుద్దేశపూరితమైంది.. యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ రూపొందించాలి.. అన్ని వర్గాల సమ్మతి ఉండేలా రూపొందించాలి.. అన్ని సంఘాలను కలిపి ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలి’ అని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.
యూసీసీ అమలు అధ్యయనంపై కమిటీని ఏర్పాటుచేయాలన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయం.. ఎన్నికల ముందు జిమ్మిక్కని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించలేరని ధ్వజమెత్తింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ముస్లిం పర్సనల్ లా అమలు కాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.