రాష్ట్రంలో అవినీతితో విసిగిపోయానని... చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ పీఎం, సీఎం, రాష్ట్రపతికి రాసిన లేఖ సంచలనంగా మారింది. అది మామూలు లెటర్ కాదు. ఆత్మహత్యకు అనుమతి కావాలని కోరుతూ రాసిన లెటర్. అందులో రాష్ట్రంలో అవినీతితో విసిగిపోయానని... చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ లెటర్ కాంట్రాక్టర్ బస్వరాజ్... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్‌లకు రాశారు.
చిక్కమగళూరు జిల్లాలోని కడూరు, మూడిగెరె గ్రామ పంచాయతీలకు కోవిడ్ సంబంధ పరికరాలను సరఫరా చేశానని కాంట్రాక్టర్ బస్వరాజ్ లెటర్‌లో పేర్కొన్నారు. అయితే సంబంధిత బిల్లులను క్లియర్ చేయడం లేదని, తనకు చెల్లింపులు జరపకుండా అధికారులు కావాలని జాప్యం చేస్తున్నారని తెలిపారు. రూ.1.12 కోట్లు ఇవ్వాలని.. వాటిని పాస్ చేయాలంటే 40 శాతాని కంటే ఎక్కువ కమీషన్లు ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.
పరికరాలను సరఫరా జరిపి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ బిల్లులు పాస్ చేయడం లేదని, కమీషన్లు ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవని ఇంక తాను బతకాలనుకోవడం లేదని లెటర్‌లో వెల్లడించారు. దీనిపై గతంలో కూడా ఫిర్యాదులు చేశానని... కానీ ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన లేఖలో కడూర్ ఎమ్మెల్యే బెల్లి ప్రకాశ్ పేరుతోపాటు తాలూకా పంచాయతీ అధికారి దేవరాజ్ నాయక్ పేరును కాంట్రాక్టర్ ప్రస్తావించారు. తనకు మరణమే శరణ్యమని తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ కర్ణాటకలో ప్రకంపనలు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ అవినీతిని ఎండగడుతూ అక్కడి వీధుల్లో ‘పేసీఎం’ పోస్టర్లు వెలిశాయి. ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందనే చర్చ సాగుతుంది. ఈ తరుణంలో ఈ లేఖ మరింత కలకలం సృష్టిస్తుంది.