గుంటూరు,స్థానిక లాడ్జి సెంటర్‌లోని నార్త్ ప్యారిస్ చర్చిలో ఆధిపత్య పోరు ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాలు రెండు నెలలుగా చర్చిలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఇరువర్గాలు చర్చిలోకి బలవంతంగా దూసుకు రావడంతో ఘర్షణకు దారితీసింది. గుంటూరు సెంట్రల్ సెనేడ్ బిషప్‌గా ఉన్న ఎస్‌జే బాబురావు నార్త్ ప్యారిస్ చర్చి ప్రధాన పాస్టర్‌గా ఉన్నారు. గతంలో ఇక్కడ పాస్టర్‌గా పనిచేసి ప్రస్తుతం ఈస్ట్‌సెనేడ్ పాస్టర్‌గా ఉన్న ఆదం కెనడీ చర్చిలో ప్రార్థనలకు హైకోర్టు అనుమతి తీసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులతో చర్చిని స్వాధీనం చేసుకునేందుకు ఆయనప్రయత్నిస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు చర్చిలో ప్రార్థనలకే పరిమితమని కాని స్వాధీనం చేసుకునే అధికారం ఆయనకు లేదని బాబురావు వర్గీయులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం, పోలీసుల జోక్యం పరిపాటిగా మారింది. చర్చిలో ప్రార్థనలు చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని కెనడీ హైకోర్టును ఆశ్రయించగా, చర్చి విషయంలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం ఆదం కెనడీ వర్గీయులు, బాబురావు వర్గీయులు పెద్దసంఖ్యలో చర్చి వద్ద మొహరించారు. ఈ క్రమంలో కెనడీ వర్గీయులు గేటు దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలపై పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 35 మందిని అరండల్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని ఇరువర్గాలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఈ ఘర్షణలో గాయపడిన ఇద్దర్ని జీజీహెచ్‌కు తరలించారు. చర్చిని స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత ఏఈఎల్సీ కార్యాలయంలోకి అడుగు పెట్టాలనే ఉద్దేశంతో హుబ్లీ ప్రాంతానికి చెందిన లాజరస్ తన వర్గీయుడైన ఆదాం కెనడీని పాస్టర్‌గా తీసుకువచ్చాడని పరదేశిబాబు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఆదివారం హుబ్లీ, విజయవాడల నుంచి పెద్దసంఖ్యలో యువకులను చర్చి వద్దకు తీసుకువచ్చాడన్నారు. మొత్తం మీద కోట్ల ఆస్తులు కలిగిన ఏఈఎల్సీ అధ్యక్ష పీఠం కోసం జరుగుతున్న పోరు తీవ్ర స్థాయికి చేరి శాంతి భద్రతల సమస్యగా మారింది.