ఈ నెల 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం ఎటువంటి సమాచారమూ లేదు. దీనిపై వారిని ప్రశ్నిస్తే.. ప్రధాని పర్యటన వివరాలు ఇంతవరకు రాష్ట్ర శాఖకు అందలేదని చెబుతున్నారు. జిల్లా అధికారులు కూడా తొలుత తమకు సమాచారం లేదన్నారు. ఇప్పుడు మాత్రం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 11, 12 తేదీల్లో ప్రధాని పర్యటన ఉంటుందని, వివరాలు రావలసి ఉందని కలెక్టర్ తెలిపారు. 11వ తేదీ రాత్రి 7 గంటలకు మోదీ విశాఖ చేరుకుంటారని, నేవీ అతిథిగృహం ఐఎన్ఎస్ చోళలో బస చేస్తారని సమాచారం. మరుసటి రోజు (12వ తేదీ) ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీసు కమిషనర్ వివిధ శాఖల పరంగా చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సమావేశాలు నిర్వహించారు.