విశాఖ రాజధాని పెట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు ధైర్యముంటే రాజీనామాలు చేసి, రాజధాని అంశం రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ చేశారు. అలానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎ్‌స)కు ఉన్న 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు వర్తింపజేశారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం కూడా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడంతో కాపులు 5 శాతం రిజర్వేషన్లని కోల్పోయారని చెప్పారు. ఈ విషయాన్ని తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో 2019 జూలై 30వ తేదీన లేఖ ద్వారా సీఎం జగన్‌కి నివేదించడం జరిగిందన్నారు. ఆ లేఖను గుర్తు చేస్తూ తాజాగా మరో లేఖను ఆయన సీఎంకి పంపారు. ప్రభుత్వాలు నియమించిన అనేక కమిటీలు, కమిషన్లతోపాటు మంజునాథ కమిటీ కూడా కాపు, బలిజ, ఒంటరి వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన సామాజికవర్గంగా గుర్తించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలలో కూడా కాపుల రిజర్వేషన్లను చేర్చారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రకారం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించజాలదన్నారు. కాపు, బలిజ, ఒంటరి వర్గాల ప్రజలకు ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.