ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొంటున్న నిర్ణయాలకు రాష్ట్రం మూల్యం చెల్లిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తంచేశారు. పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి ఎవరూ రాలేని పరిస్థితి సృష్టించారని, ఈ రాష్ట్రం వైపు చూడటానికి కూడా పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో నెలకొన్న పరిస్థితి, యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంపై మంగళవారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబరు నుంచి 2021 జూన్ వరకూ కర్ణాటక రూ.లక్షన్నర కోట్లు, తమిళనాడు రూ.30 వేల కోట్లు, తెలంగాణ రూ.18 వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షిస్తే ఏపీకి కేవలం రూ.రెండున్నర వేల కోట్లు మాత్రమే వచ్చాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో దేశంలో రాష్ట్రం పదమూడో స్థానానికి పడిపోయింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పతనంచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది’ అని ఆయన తన లేఖలో వివరించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వివేకంతో ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.